AP Police Recruitment 2022

  • Post author:
  • Post published:November 29, 2022
  • Post category:Notifications
  • Post last modified:November 29, 2022

6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

6,100 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

411 ఎస్సై ఉద్యోగాలు

.

రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి సోమవారం ప్రకటన జారీచేసింది. డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై స్థాయి, 6,100 కానిస్టేబుల్‌ స్థాయి పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ జారీచేశారు. సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న, సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 2023 జనవరి 22న ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించనున్నారు.

విద్యార్హతలు

* సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్‌ ఉత్తీర్ణులై డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది.

* సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఇంటర్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదో తరగతి ఉత్తీర్ణులై.. ఇంటర్‌ రెండేళ్లు చదివి ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి

* సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 21-27 ఏళ్లమధ్య వయసు ఉన్నవారు అర్హులు. 1995 జులై 2 తర్వాత, 2001 జులై 1 కంటే ముందు జన్మించిన వారై ఉండాలి.

* కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 18-24 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. 1998 జులై 2 తర్వాత, 2004 జులై 1 కంటే ముందు పుట్టినవారై ఉండాలి. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంది.

హోంగార్డులకు రిజర్వేషన్లు

* హోంగార్డులకు సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టుల్లో రిజర్వేషన్‌ను 8 నుంచి 15 శాతానికి, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు 10 నుంచి 25 శాతానికి పెంచారు.

* ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు రెండింటిలోనూ మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది.

దరఖాస్తుల స్వీకరణ

* ఆన్‌లైన్‌లో slprb.ap.gov.in లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.

* సందేహాలు ఉంటే: ఆంధ్రప్రదేశ్‌ పోలీసు నియామక మండలి ఫోన్‌ నంబరు 9441450639కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కాల్‌ చేయొచ్చు.

మూడు దశల్లో ఎంపిక

సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు

* ప్రాథమిక రాత పరీక్ష: 2 పేపర్లు…200 మార్కులకు. బహుళైౖచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఉంటాయి.
పేపర్‌-1: పదోతరగతి స్థాయిలో అర్థమెటిక్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ
పేపర్‌-2: జనరల్‌ స్టడీస్‌ (డిగ్రీ స్థాయిలో)

దేహదారుఢ్య పరీక్షలు

* ప్రాథమిక రాతపరీక్షలో అర్హత మార్కులు సాధించిన వారినే దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికచేస్తారు.

* సివిల్‌ ఎస్సై ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు 1,600 మీటర్ల పరుగు నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలి. లాంగ్‌జంప్‌ లేదా 100 మీటర్ల పరుగులో ఏదో ఒకటి పూర్తిచేయాలి. వీటిలో అర్హత సాధిస్తే చాలు. తుది ఎంపికకు ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.

* ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ మూడూ పూర్తిచేయాలి. 100 మార్కులకు ఈ పరీక్షలు ఉంటాయి. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

తుది రాత పరీక్ష

* మొత్తం పేపర్లు: 4 – మార్కులు: 600
* పేపర్‌-1: ఆంగ్లం (100 మార్కులకు)
* పేపర్‌-2: తెలుగు లేదా ఉర్దూ (100 మార్కులకు)
* ఈ రెండు పేపర్లు వివరణాత్మక విధానం (డిస్క్రిప్టివ్‌)లో ఉంటాయి. వీటిలో అర్హత మార్కులు సాధిస్తే చాలు.
* పేపర్‌-3: అర్థమెటిక్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ (200 మార్కులకు)
* పేపర్‌-4: జనరల్‌ స్టడీస్‌ (200 మార్కులకు)
* వీటిల్లో ప్రశ్నలు బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి.
* ఆంగ్లం, తెలుగు పేపర్లలో అర్హత సాధించకపోతే మిగతా రెండు పేపర్లను పరిగణనలోకి తీసుకోరు.
* పేపర్‌-3, పేపర్‌-4లో 400 మార్కులకు అత్యధిక మార్కులు సాధించినవారిని సివిల్‌ ఎస్సై ఉద్యోగాలకు ఎంపికచేస్తారు.
* ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై పోస్టులకు పోటీపడేవారికి పేపర్‌-1, పేపర్‌-2 యథాతథంగా ఉంటాయి. పేపర్‌-3, పేపర్‌-4లను చెరో వందమార్కుల చొప్పున 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన మార్కులకు దేహదారుఢ్య పరీక్షల్లో వచ్చిన మార్కులను కలపుతారు. అత్యధిక మార్కులు సాధించినవారిని ఉద్యోగానికి ఎంపికచేస్తారు.

సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపిక ఇలా

మొదటి దశ:
ప్రాథమిక రాతపరీక్ష: ఒకటే పేపర్‌ 200 మార్కులకు (3 గంటల పాటు)
పరీక్షలో వచ్చే అంశాలు: ఆంగ్లం, అర్థమెటిక్‌ (పదోతరగతి స్థాయి), రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌, భారతచరిత్ర, సంస్కృతి, భారత జాతీయోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత   కలిగిన వర్తమాన అంశాలు.

 

రెండో దశ:
శారీరక కొలతలు, దేహదారుఢ్య పరీక్షలు: ప్రాథమిక రాతపరీక్షలో అర్హత మార్కులు సాధించిన వారికే నిర్వహిస్తారు.
సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీపడేవారు: 1,600 మీటర్ల పరుగు తప్పనిసరిగా పూర్తిచేయాలి. లాంగ్‌జంప్‌ లేదా 100 మీటర్ల పరుగులో ఏదో ఒకటి పూర్తిచేయాలి. వీటిలో అర్హత సాధిస్తే చాలు. తుది ఎంపిక కోసం ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీపడేవారు: 1,600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ మూడూ పూర్తిచేయాలి. ఈ మూడు విభాగాల్లో ప్రదర్శించిన ప్రతిభకు మార్కులు కేటాయిస్తారు. వీటిని తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.

మూడో దశ:
తుది రాతపరీక్ష: శారీరక కొలతలు, దేహదారుఢ్య పరీక్షల్లో ఎంపికైనవారికి తుది రాతపరీక్ష నిర్వహిస్తారు. సివిల్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు 200 మార్కులకు, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
పరీక్షలో వచ్చే అంశాలు: ఆంగ్లం, అర్థమెటిక్‌ (పదోతరగతి స్థాయి), రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌, భారతచరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు.
సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు తుది ఎంపిక: తుది రాతపరీక్షలో 200 మార్కులకు అత్యధిక మార్కులు పొందినవారు ఉద్యోగానికి ఎంపికవుతారు.
ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు తుది ఎంపిక: చెరో వందమార్కులకు నిర్వహించే దేహదారుఢ్య, తుది రాతపరీక్షల్లో కలిపి మొత్తం 200 మార్కులకు అత్యధిక మార్కులు పొందినవారు ఉద్యోగానికి ఎంపికవుతారు.

 

ముఖ్యమైన తేదీలు

సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు
* దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 2022 డిసెంబరు 14 నుంచి

* దరఖాస్తుల సమర్పణకు తుది గడువు: 2023 జనవరి 1

* ప్రాథమిక రాతపరీక్షకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 2023 ఫిబ్రవరి 5 నుంచి

* పరీక్ష తేదీ: 2023 ఫిబ్రవరి 19 (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్‌-2)

సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు
* దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 2022 నవంబరు 30

* దరఖాస్తుల సమర్పణకు తుది గడువు: 2022 డిసెంబరు 28

* ప్రాథమిక రాత పరీక్షకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 2023 జనవరి 9 నుంచి

* పరీక్ష తేదీ: 2023 జనవరి 22

Comments

comments