మహిళా, శిశు సంక్షేమ చట్టాలు… సమగ్ర అవగాహన

1. నిర్భయ చట్టం అంటే ఏమిటి?
ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపినా దరిమిలా కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని (క్రిమినల్ లా అమెండ్‌మెంట్ యాక్ట్- 2013) అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్‌లో 376 ఎ చేర్చడంతోపాటు పలు మార్పులను తీసుకొచ్చింది. అత్చాచార సంఘటనలతోపాటు మహిళలకు సంబంధించిన ఇతర నేరాల్లో నిందితులకు మరణ శిక్ష సైతం పడేలా ఇండియన్ పీనల్ కోడ్‌ను మరింతగా కఠినతరం చేసింది.

ఇవన్నీ కూడా 354సి నిర్భయ చట్టం కింద వర్తించే నేరాలు

    • పాఠశాలలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండులు, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో మహిళలకు సరైన మరుగుదొడ్ల వసతి లేకపోవడం నేరమే.
    • అలాగే మహిళలకు నాప్‌కియి(నెలసరి ప్యాడ్‌‌స) అందుబాటులో లేకపోవడం కూడా నేరమే.
    • షాపింగ్‌మాల్స్‌లోని ట్రయల్‌రూమ్స్‌లో, టాయ్‌లెట్స్‌లలో అలాగే సినిమాహాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాల్లోని టాయ్‌లెట్స్‌లలో రహస్య కెమెరాలు పెట్టడం నేరం. దీన్ని వాయొరిజం కింద పరిగణిస్తారు.
    • బస్సుల్లో, ఇతర రద్దీ ప్రదేశాల్లో స్త్రీలను తాకడం, అసభ్యకరంగా మాట్టాడడం, అసభ్యకర సైగలు చేయడం, స్త్రీలకు పురుషులు తమ ప్రై వేట్ పార్‌‌ట్స చూపించడం, అలాగే కార్యాలయాల్లో ఉద్యోగినుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, వారిని తూలనాడడం, వేధించడం, సెక్సువల్‌గా అబ్యూజ్ చేయడం, వారిని అవమానించడం వంటివన్నీ నేరాలే. 354, 509 విమెన్ ఇన్‌సల్టింగ్ సెక్షన్ల కింద వీటికి శిక్ష ఉంటుంది.
  • ఇక పబ్లిక్ ప్రదేశాల్లో అమ్మాయిల మీద కన్నేయడం, వెంబడించడం, ఈవ్‌టీజింగ్, వంటివన్నీ నేరాలన్న సంగతి విదితమే.
  • అంతేకాదు ఇంట్లో కూడా స్త్రీలను, ఈడు వచ్చిన అమ్మాయిలను తాత మొదలుకొని తండ్రి, అన్న, బాబాయ్, పెద్దనాన్న, మేనమామ ఇలాంటి వాళ్లెవరైనా పరుషపదజాలంతో తిట్టడం, వ్యక్తిగత స్వేచ్ఛ హరించేలా తీవ్రమైన నిఘా పెట్టడం, శీలరక్షణ పేరుతో వాళ్లను కట్టడి చేయడం, శీలంపేరుతో వాళ్ల ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడడం వంటివన్నీ నేరాలే గృహహింస చట్టం కింద. అలాగే ఇంట్లో ఆడపిల్లలను అబ్బాయిలతో పోల్చి తిట్టడం, చులకన చేయడం, వివక్ష చూపించడం వంటివీ నేరాలే.
  • మ్యారిటల్ రేప్ను జస్టీస్ వర్మ కమిటీ 376(బి) నిర్భయ చట్టం కింద నేరంగా పరిగణించాలని సూచించింది. కానీ దీనివల్ల భారతీయ వివాహ, కుటుంబ వ్యవస్థలు బీటలు వారుతాయని రాజకీయ పక్షాలు ఆమోదించలేదు. కాని విడాకులు తీసుకున్న భార్యను, లేదా భర్త నుంచి విడిగా ఉంటున్న ఇల్లాలిని భర్త బలవంతం చేస్తే రేప్‌గా పరిగణించాలని మాత్రం నిర్ణయించారు. వివాహబంధంలో ఉన్న భర్త ..భార్య మానసిక, శారీరక పరిస్థితి తెలుసుకోకుండా ఆమెను ఇబ్బంది పెట్టడం, బలవంతం చేయడం క్రూయల్టీ కింద పరిగణించే నేరమే.


2. డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ అంటే….?
హింసలేని కుటుంబాల్లో మహిళలు ఆనందంగా బతకాలని రాజ్యంగంలో మహిళా హక్కులకు సంబంధించి హామి ఉంది. పెళ్లికాని, పెళ్లయిన స్త్రీలు, పెళ్లిలాంటి బంధంలో ఉన్న స్త్రీలకు గృహహింస నుంచి రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన చట్టమే డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్- 2005 (గృహహింస నుంచి మహిళలకు రక్షణ చట్టం). మహిళల మీద జరిగే అనేక హింసారూపాలను గుర్తించిన ఏకైక చట్టమిది. శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక హింసల నుంచి స్త్రీలకు రక్షణ కల్పించి తగిన ఉపశమనాలను, పరిష్కారాలను ఇస్తుందీ చట్టం.

  • సెక్షన్ 18: రక్షణ ఉత్తర్వులు.. హింసను ఆపాలని, హింసించే పనులు చేయరాదని, మహిళ పనిచేసే చోటుకు వెళ్లరాదని, దారికాచి వేధించరాదని, ఆమె నివసించే ప్రదేశానికి వెళ్లి వేధించరాదని ఇచ్చే ఉత్వర్వులే రక్షణ ఉత్తర్వులు లేక ప్రొటెక్షన్ ఆర్డర్స్.
  • సెక్షన్ 19: మహిళను ఇంటి నుంచి గెంటేయకుండా అంటే వెళ్లగొట్టకుండా ఇచ్చే ఉత్తర్వులు. వీటినే రెసిడెన్షియల్ ఆర్డర్స్ లేక నివాస ఉత్తర్వులు అంటారు.
    • సెక్షన్ 20: జీవనభృతికి సంబంధించిన ఉత్తర్వులు… అంటే మెయిన్‌టెనెన్స్ ఆర్డర్స్.
    • సెక్షన్ 21: మైనర్ పిల్లల అధీనపు ఉత్తర్వులు అంటే కస్టడీ ఆర్డర్స్.
    • సెక్షన్ 22: నష్టపరిహారపు ఉత్తర్వులు… అంటే మానసికంగా వేధించినందుకు, హింసించినందుకు పొందే కాంపెన్సేషన్ ఆర్డర్స్.
    గృహహింస చట్టం సివిల్ చట్టం. జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ వారిని సంప్రదించి అక్కడే ఫిర్యాదు నమోదు చేయిచుకోవాలి. ప్రొటెక్షన్ ఆర్డర్స్ కేసు నమోదు చేయడంలో సహాయపడి.. కోర్డుకు పంపి విచారణ ప్రారంభమయ్యేలా చేస్తారు. కోర్టు ఇచ్చన ఉత్తర్వుల్లో దేన్నయినా ప్రతివాదులు ఉల్లంఘిస్తే అప్పుడు మాత్రమే క్రిమినల్ చర్యలు తీసుకొనేందుకు వీలుంటుంది. జైలు శిక్ష, జరిమానా విధించేవీలుంటుంది.

    3. ఎన్‌ఆర్‌ఐ విమెన్ సేఫ్టీ సెల్ అంటే ఏమిటి?
    ఎన్‌ఆర్‌ఐని పెళ్లి చేసుకున్న మహిళల భద్రత కోసం అంటే ఎన్‌ఆర్ భర్త పెట్టే హింస, ఇబ్బందుల నుంచి సంబంధిత స్త్రీలకు రక్షణ, న్యాయ సహాయం అందించడానికి ఏర్పడిందే ఎన్‌ఆర్‌ఐ సెల్. తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నడుస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, హోమ్ శాఖ, జాతీయ మహిళా కమిషన్ , భారతీయ రాయబార కార్యాలయాల సహాయం, సహకారంతో ఎన్‌ఆర్‌ఐ వివాహితల సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పడుతోందీ ఎన్‌ఆర్‌ఐ విమెన్ సేఫ్టీ సెల్.

 

Comments

comments