మహిళలపై తరచు జరిగే తీవ్ర నేరాలు… సంబంధిత సెక్షన్లు

    • ఐపీసీ 304 బి: వరకట్న హత్యలను ఈ సెక్షన్ నేరంగా పరిగణిస్తుంది. వివాహం జరిగిన ఏడేళ్లలోగా ఒక మహిళ కాలిన గాయాలు లేదా శరీరంపై ఇతర గాయాల కారణంగా మరణించినట్లయితే, చట్టం వరకట్న హత్యగా పరిగణిస్తుంది. ఇలాంటి సంఘటనల్లో నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు ఉంటాయి.
    • ఐపీసీ 326 ఎ 326 బి: యాసిడ్ దాడుల సంఘటనల్లో నిందితులకు ఈ సెక్షన్ల కింద ఐదేళ్లకు తగ్గకుండా యావజ్జీవ శిక్ష వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
    • ఐపీసీ 354: బలప్రయోగం ద్వారా మహిళల గౌరవానికి భంగం కలిగించిన సంఘటనల్లో ఈ సెక్షన్ కింద ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
 
    • ఐపీసీ 354 ఎ: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే నిందితులకు ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కలిపి కూడా విధించే అవకాశాలు ఉంటాయి. మహిళలను అసభ్యంగా తాకడం, అశ్లీల చిత్రాలను, దృశ్యాలను వారికి చూపడం, శృంగారం కోసం వేధించడం, మహిళలపై అశ్లీల వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలు ఈ సెక్షన్ కింద లైంగిక వేధింపులుగా పరిగణిస్తారు.
    • ఐపీసీ 354 బి: బలవంతంగా మహిళల దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించడం లేదా దుస్తులను విడిచిపెట్టేలా మహిళలను బలవంతపెట్టడం, దుస్తులను తొలగించే ఉద్దేశంతో మహిళలపై దాడి చేయడం ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
    • ఐపీసీ 354 సి: మహిళలు ఏకాంతంగా దుస్తులు మార్చుకుంటుండగా లేదా స్నానం చేస్తుండగా చాటు నుంచి వారిని గమనించడం, రహస్యంగా లేదా అనుమతి లేకుండా, వారి ఏకాంతంలోకి జొరబడి వారి ఫొటోలు తీయడం, వీడియోలు తీయడం వంటి చర్యలను ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
 
    • ఐపీసీ 354 డి: ఒక మహిళ తన నిరాసక్తతను, అయిష్టతను స్పష్టంగా తెలియజేసినా, ఆమెను అదేపనిగా వెంటాడటం, ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించడం, ఆమె సోషల్ మీడియా, ఇంటర్నెట్ కార్యకలాపాలను నిరంతరం గమనిస్తూ ఉండటం వంటి చర్యలను ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. మొదటిసారి ఈ నేరానికి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. మరోసారి కూడా ఇదే నేరానికి పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
    • ఐపీసీ 366: బలవంతపు పెళ్లి కోసం లేదా అనైతిక శృంగారం కోసం మహిళలను కిడ్నాప్ చేయడాన్ని ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
    • ఐపీసీ 366 ఎ: బలవంతపు శృంగారం కోసం లేదా మాయమాటలతో మభ్యపెట్టి శృంగారంలో పాల్గొనేలా చేయడం కోసం పద్దెనిమిదేళ్ల లోపు బాలికలను ఒక చోటి నుంచి మరో చోటుకు తరలించుకుపోవడాన్ని ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి
  • ఐపీసీ 366 బి: బలవంతపు శృంగారం కోసం లేదా అనైతిక శృంగారం కోసం విదేశాల నుంచి లేదా జమ్ము కశ్మీర్ నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు వయసున్న యువతులను భారతదేశంలోకి తీసుకురావడం నేరం. దీనికి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటాయి.
  • ఐపీసీ 372: పద్దెనిమిదేళ్ల లోపు వయసున్న బాలికలను వ్యభిచారం కోసం లేదా అనైతిక శృంగారం కోసం ఇతరులకు విక్రయించడం లేదా ఇతరుల వద్ద డబ్బు తీసుకుని మైనర్ బాలికలతో వ్యభిచారం చేయించడం వంటి చర్యలు నేరం. ఈ నేరానికి పాల్పడే వారికి పదేళ్ల వరకు జైలు, జరిమానా ఉంటాయి.
  • ఐపీసీ 373: పద్దెనిమిదేళ్ల లోపు వయసు బాలికలను వ్యభిచారం కోసం లేదా అనైతిక శృంగారం కోసం కొనుగోలు చేయడం లేదా డబ్బు చెల్లించి వారిని వ్యభిచారం కోసం వాడుకోవడం వంటి చర్యలను ఈ సెక్షన్ కింద నేరాలుగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడే వారికి పదేళ్ల వరకు జైలు, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 375: ఒక మహిళ ఇష్టానికి విరుద్ధంగా, ఆమె అంగీకారం లేకుండా శృంగారం జరపడాన్ని ఈ సెక్షన్ అత్యాచారంగా పరిగణిస్తుంది. బెదించడం ద్వారా అంగీకారం పొంది శృంగారం జరిపినా, మత్తులో ఉన్నప్పుడు శృంగారం జరిపినా, మైనర్ బాలికను ఆమె అంగీకారంతోనే శృంగారం జరిపినా ఈ సెక్షన్ అత్యాచారంగానే పరిగణిస్తుంది. ఈ సెక్షన్ అత్యాచారానికి పూర్తి నిర్వచనమిస్తుంది.
  • ఐపీసీ 376: పోలీసు అధికారులు, జైలు అధికారులు, ఆర్మీ అధికారులు, సైనికులు సహా ఏయే వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడే అవకాశం ఉందో ఈ సెక్షన్ విపులీకరిస్తుంది. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే నిందితులకు ఏడేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 376 ఎ: అత్యాచారం జరపడంతో పాటు బాధితురాలిని తీవ్రంగా గాయపరచి, ఆమెను శాశ్వత వికలాంగురాలయ్యేలా చేసినా, నిందితుడు చేసిన గాయాల కారణంగా బాధితురాలు మరణించినా ఈ సెక్షన్ కింద ఇరవయ్యేళ్ల జైలు శిక్ష నుంచి మరణ శిక్ష పడే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 376 బి: వేరుగా ఉంటున్న మహిళపైన లేదా విడాకులు పొందిన మహిళపైన ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఆమె భర్త శృంగారం జరిపినట్లయితే, ఈ సెక్షన్ దానిని అత్యాచారంగానే పరిగణిస్తుంది. ఈ నేరానికి రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 376 సి: అధికారంలో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా బాధితురాలిపై అధికారం చలాయించే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఆమెను లొంగదీసుకుని శృంగారంలో పాల్గొనడాన్ని ఈ సెక్షన్ అత్యాచారంగా పరిగణిస్తుంది. ఈ సెక్షన్ కింద నిందితులకు ఆరేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 376 డి: ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక మహిళపై అత్యాచారం జరపడాన్ని ఈ సెక్షన్ సామూహిక అత్యాచారంగా పరిగణిస్తుంది. సామూహిక అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు ఇరవై ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 376 ఇ: ఒకసారి అత్యాచార కేసులో దోషిగా తేలిన వ్యక్తి తిరిగి మరోసారి అదే నేరానికి పాల్పడినట్లయితే ఈ సెక్షన్ కింద యావజ్జీవ శిక్ష లేదా మరణ శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి.
  • ఐపీసీ 498 ఎ: వరకట్న నిషేధ చట్టం-1961లోని సెక్షన్ 324 కింద వరకట్నం అడగడం, ఇవ్వడం కూడా నేరమే. వరకట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచులు లేదా భర్త తరఫు ఇతర బంధువులెవరైనా ఒక మహిళను వేధింపులకు గురిచేస్తే ఐపీసీ 498 ఎ సెక్షన్‌తో పాటు వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద కేసులు నమోదు చేస్తారు.
  • ఐపీసీ 498 ఎ: భర్త లేదా అతని తరఫు బంధువులు ఒక మహిళను శారీరకంగా లేదా మానసికంగా హింసించడాన్ని, ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించడాన్ని ఈ సెక్షన్ నేరంగా పరిగణిస్తుంది. ఈ నేరానికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
  • వరకట్నం కోసం భర్త ఆమె తరఫు బంధువులు ఒక మహిళను హింసించినట్లు నేరం రుజువైతే, ఐపీసీ 498- సెక్షన్‌తో పాటు వరకట్న నిషేధ చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. అలాగే కట్నం కింద తీసుకున్న డబ్బును, నష్టపరిహారాన్ని బాధితురాలికి చెల్లించాల్సి ఉంటుంది.
  • వివాహిత మహిళను ఆత్మహత్యకు పురిగొల్పేంతగా వేధించడాన్ని, శారీరకంగా, మానసికంగా గాయపరచడాన్ని చట్టం క్రూరత్వంగానే పరిగణిస్తుంది.
  • ఉద్దేశపూర్వకంగా ఆమె ఆరోగ్యానికి భంగం కలిగేలా ప్రవర్తించడం.. ఉదా: తిండి పెట్టకపోవడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు చికిత్స జరిపించకపోవడం వంటివి..
  • బాధితురాలి పుట్టింటి నుంచి ఆస్తి కోసం, విలువైన వస్తువులు, కానుకల కోసం మాటలతో, చేతలతో వేధించడం వంటి చర్యలు క్రూరత్వం కిందకే వస్తాయి.
  • భార్య బతికి ఉండగానే, ఆమెకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే నేరం. దీనిని ఐపీసీ సెక్షన్ 494 ప్రకారం బైగమీ అంటారు. ఈ నేరానికి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. రెండో పెళ్లి చెల్లకుండాపోతుంది. అయితే మొదటి భార్యకు మగపిల్లాడు పుట్టలేదని, మగ సంతానం కోసం రెండో పెళ్లికి బలవంతంగా ఆమె దగ్గర అనుమతి తీసుకున్నా ఇదీ బైగమీ కింద నేరమే అవుతుంది. పైగా అంగీకారం, అనుమతి రెండూ చెల్లవు

Comments

comments

author avatar
V V Academy
Vvacademy,v.v.academy,vvacademy,V V ACADEMY, Institute for Competitive Exams. V V Academy a vision of victory have been giving coaching for CONSTABLE, SI , APPSC,BANK CLERKS, POs,SSC, SSC CGL ,MTS,CHSL,RRB,RRB LOCOPILOT , RRB JE ,RRB SE,POSTAL ,LGO ,POSTMAN, LIC RRB GROUP-D ,RRB PSYCHOLOGY TEST,RPF for last 5 years. Every year our students get Jobs in every competitive exam. We give quality education to the students providing excellent study materials and online exams, well experienced faculty and with a planned schedule.