సావిత్రిబాయి ఫూలే (3 జనవరి 1831 – 10 మార్చి 1897)
సావిత్రిబాయి ఫూలే (3 జనవరి 1831 – 10 మార్చి 1897) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందికుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.
స్త్రీ సాధికారత కోసం, వారి హక్కుల కోసం కృషి చేసిన సావిత్రి బాయి జీవితం ఆదర్శప్రాయం. వారు చూపిన మార్గాన్ని అనుసరించడమే వారికి మనం ఇచ్చే నివాళి.
సావిత్రిబాయి ఫూలే దేశంలో సామాజిక చైతన్యాన్ని, స్త్రీ చైతన్యాన్ని కలిగించిన వారిలో ముఖ్యులు. మహారాష్ట్రలో సతారా జిల్లాలో జనవరి 3న జన్మించిన సావిత్రి బాయికి తొమ్మిదేళ్ల వయసులోనే జ్యోతిరావు ఫూలేతో వివాహం అయింది. మహాత్మా జ్యోతి బా ఫూలే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవహక్కులు వంటి భావనలు విద్య ద్వారానే సాధ్వమవుతాయని బలంగా విశ్వసించారు. ఫూలే ప్రోత్సాహంతోనే సావిత్రిబాయి చదువుకున్నారు. ఆరోజుల్లో అణగారిన వర్గాలకు, స్త్రీలకు చదువుకోవడానికి పాఠశాలలు ఉండేవి కావు. అందుకే సావిత్రి బాయి పెళ్లికి ముందు మూడవ తరగతి వరకే చదివారు. పెళ్లి తర్వాత జ్యోతిబా ఫూలే చొరవతో తిరిగి చదువు కొనసాగించారు. అంతేకాదు ఫూలే ఆమె చదువుకునే అవకాశం కల్పించడమే కాదు ఆమె చదువు పదిమందికి ఉపయోగపడేలా టీచర్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు.
అలా సావిత్రి బాయి తాను విద్య నేర్చుకుని, పదిమందికి నేర్పించారు. ఈ విధంగా సావిత్రి బాయి ఈ దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు. సమాజంలో స్త్రీలు అన్నిరంగాల్లో ముందుండాలని, స్త్రీలు చదవగలరు, రాయగలరు, పోరాటం చేయగలరని నిరూపించిన దార్శనికురాలు సావిత్రి బాయి ఫూలే. అట్టడుగు వర్గాలకు చదువు చెప్పడానికి వెళ్లేటప్పుడు ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఫూలే దంపతులు మహారాష్ట్రలో బలమైన సామాజిక ఉద్యమాలను నిర్మించారు. మహారాష్ట్రలో అణగారిన వర్గాల వారు నివసించే ప్రాంతాల్లో మొదట పాఠశాలలు ప్రారంభించారు. తర్వాత ఆడ పిల్లల కోసం కూడా ప్రత్యేక పాఠశాలలను పూలే దంపతులు ఏర్పాటు చేశారు.
వారు స్థాపించిన పాఠశాలలో నాడు విద్యకు నోచుకోని స్త్రీలు, అణగారిణ వర్గాల విద్యార్థులు ఎంతో మంది చదువుకున్నారు. సావిత్రిబాయి అట్టడుగు వర్గాలకు విద్య నేర్పించడానికి అగ్రకులాల వారు సహించలేకపోయారు. ఆమెను అనేక అవమానాలకు గురిచేశారు. ఆమెపై కోడిగుడ్లు, టమాటాలు, బురద, రాళ్లు విసిరేవారు. వారి చర్యలతో విసుగు చెందిన సావిత్రి ఉద్యోగం మానాలని భావించారు. అయితే భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో సావిత్రి బాయి పోరాటాన్ని వదిలిపెట్టలేదు. ఏ సమాజం సంకెళ్లు విధించిందో వాటిని తెంపి స్త్రీ విద్య, వారి హక్కుల కోసం నిరంతరం ఉద్యమించారు.
సావిత్రి బాయి అణగారిని వర్గాల వారినేకాకుండా బ్రాహ్మణ స్త్రీలకు కూడా ఆదరించారు. అగ్రవర్ణాల్లోని వితంతువులను చేరదీశారు. వారికి కొత్త జీవితాలను ప్రసాదించారు. వితంతువుల కోసం, వారి పిల్లల కోసం జ్యోతిరావు శరణాలయాలను స్థాపించారు. ఇందులో కూడా సావిత్రిబాయి తన సేవలు అందించారు. జ్యోతిరావు ఫూలే 1837లో సత్యశోధక సమాజం ఏర్పాటు చేశారు. అందులో భర్తతో పాటు సావిత్రి బాయి క్రియాశీలయంగా పాల్గొన్నారు. 1876-77,1896-97లో మహారాష్ట్రలో కరువు కాటకాలు సంభవించాయి. అప్పుడు ఉచిత భోజన వసతి హాస్టళ్లను ఏర్పాటు చేయాలని, కరువు నివారణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సమయంలో సత్యశోధక్ సమాజ్ చేసిన సేవ, ముఖ్యంగా సావిత్రిబాయి చేసి సేవ చిరస్మరణీయం.
దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, మొట్టమొదటి సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫూలేనే. తన రచనల ద్వారా ఆనాటి సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను బద్దలు కొట్టారు. తన భర్త మహాత్మా జ్యోతిబా ఫూలే 1890లో మరణించినా ఆయన ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగించారు. 1890లో పుణె పరిసర ప్రాంతాల్లో ప్లేగు వ్యాధి ప్రబలింది. ఆమె వ్యాధి బారిన పడిన వారికి సేవలు చేసింది. స్త్రీలకు ఆదర్శంగా నిలిచారు. ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ ఆ వ్యాధి బారిన పడిన సావిత్రి బాయి 1897 మార్చి 10న మరణించారు.
సమాజంలో ఉన్న అసమానతలు రూపుమాపాలంటే విద్యా ద్వారానే అది సాధ్యమౌతుందని ఫూలే దంపతులు భావించారు. అలాగే నాడు వ్యవస్థలో గూడుకట్టుకున్న అనేక మూఢనమ్మకాలను పారదోలాలంటే విద్య ఒక పరిష్కారం అని చాటిచెప్పారు. స్త్రీ సాధికారత కోసం, వారి హక్కుల కోసం కృషి చేసిన సావిత్రి బాయి జీవితం ఆదర్శప్రాయం. వారు చూపిన మార్గాన్ని అనుసరించడమే వారికి మనం ఇచ్చే నివాళి.