Mahatma Gandhi Death Anniversary:
Mahatma Gandhi Death Anniversary:
మహాత్మాగాంధీ హత్యకు దారి తీసిన కారణాలేంటి. అసలు ఆ రోజు ఏం జరిగింది. గాంధీని కాల్చాక గాడ్సే ఏం చేశాడు. భారత్ లో గాడ్సేకు గుడి కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే అంశం ఆసక్తికరమే. సత్యం, అహింసా సిద్దాంతాలను పాటించిన గాంధీ తర్వాత సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి ఆయుధాలతో ఎలా పోరాడింది. భారత దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో తన వంతుపాత్ర పోషించింది ఇప్పటి తరాలు తప్పక తెలుసుకోవాల్సిందే. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ. సత్యం, అహింస ఆయన నమ్మిన సిద్దాంతాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం గాంధీజీ పోరాట ఆయుధాలు. స్వాతంత్ర్య సాధన కోసం భారత జాతిపిత అనేక అవమానాలను ఎదుర్కున్నాడు. విమర్శలను తట్టుకున్నాడు. ఆవేదనను దిగమింగుకున్నాడు. ఆంగ్లేయుల పాలన నుంచి భారత్ కు స్వాతంత్ర్యం సిద్దించడం కీలక పాత్ర పోషించిన అగ్రగణ్యులలో ఒకరిగా నిలిచారు. 20 వ శతాబ్దిలోని మానవాళిని ప్రభావితం చేసిన మహా ప్రముఖులలో ఒకరు. కళ్లకు జోడు, చేతిలో కర్ర, నడుము మధ్యలో వాచీ ఎవరి వద్ద ఉంటాయి అంటే చాలు.. టక్కున చెప్పేస్తారు గాంధీ అని. అంతలా ప్రజల్లో పెన వేసుకుపోయారాయన. చిన్న పిల్లలు ముద్దుగా గాంధీ తాతా అని పిలుచుకోవడం ఆ మహనీయుడి మీద ఉన్న గౌరవమేనని చెప్పాలి.
చిన్నతనంలోనే…
విదేశీ వస్త్రాలను బహిష్కరించడమే కాదు..స్వదేశీ ఖద్దరు దుస్తులను నేసేందుకు ఆయనే స్వయంగా రాట్నం పట్టాడు. నూలు ఒడికి, మురికి వాడలు శుభ్రం చేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. సత్యాగ్రాహం, అహింసాతో ముందుకు వెళ్లాలంటే ఎంతో ధైర్యం కావాలని చెప్పేవారాయన. అందుకే ఆయన్ను మహాత్ముడిగా, జాతిపితగా పిలుచుకుంటారు ప్రజలు. గుజరాత్ లోని పోరుబందర్ లో 1869 అక్టోబర్ 2న జన్మించారు మోహన్ దాస్ గాంధీ. తండ్రి కరం చంద్ గాంధీ. తల్లి పుతలీబాయి. ఆచార వ్యవహారాలు పాటించే సంప్రదాయ కుటుంబంలో పుట్టారు గాంధీ. చిన్న తనం నుంచి అబద్దాలు చెప్పడానికి తటపటాయించేవారు ఆ పిల్లోడు. పెళ్లి అంటే ఎంటో పెద్దగా తెలియని వయసులోనే గాంధీకి కస్తూర్బాయితో వివాహమైంది. వీరి దాంపత్య జీవితానికి కానుకగా..హరిలాల్ గాంధీ, మణి లాల్ గాంధీ, రామ్ దాస్ గాంధీ, దేవదాస్ గాంధీ పుట్టారు. చదువులో గాంధీ సాదా సీదా విద్యార్థి. మొదటగా పోర్ బందర్ లోను, తర్వాత రాజ్ కోట్ లోను ఆయన విద్యాభ్యాసం సాగింది. 19 ఏళ్ల వయసులో గాంధీ న్యాయ శాస్త్ర విద్య అభ్యసించాలనే పట్టుదల కలిగింది. ఇక ఆలస్యం చేయలేదు..ఇండియా నుంచి ఇంగ్లాండ్ కు వెళ్లి మరీ తన విద్యను కొనసాగించాడు. బ్రిటన్ వెళ్లేటప్పుడు తల్లికి ఓ మాట ఇచ్చారు గాంధీ. ఎట్టి పరిస్థితుల్లోను తాను మందు తాగనని, మాంసం ముట్టనని, అమ్మాయిలకు దూరంగా ఉంటానన్నదే ఆ ప్రతిన.
1891లో న్యాయ వాద విద్యలో పట్టభద్రుడై భారత్ కు తిరిగొచ్చాడు మహాత్ముడు. ముంబై, రాజ్ కోట్ లో నాయ్య వాద వృత్తి చేసినా పెద్దగా రాణించలేదు. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటల్ లోని ఓ కంపెనీలో పని చేసేందుకు ఆయన అక్కడకు వెళ్లాడు. ఏడాది కాంట్రాక్టు మీద వెళ్లిన ఆయన ఒకటా..రెండా ఏకంగా 21 ఏళ్ల పాటు అక్కడే గడిపాడు. తెల్లవాడు కానుందువల్ల గాంధీ అక్కడ అనేక అవమానాలు ఎదుర్కున్నాడు. రైలు బండి మొదటి తరగతి నుంచి బయటకు గెంటారు తెల్లవారు. హోటళ్లకు రానివ్వలేదు. జాతి వివక్షను ఎదిరించి పోరాడటానికి మార్గం చూపింది ఆ సంఘటనలే.
అహింసనే ఆయుధం…
పోరాటాలు, సంస్కరణలు గాంధీ జీవితంలో భాగమయ్యాయి. అస్పృశ్యత, కుల వివక్ష, మత విద్వేషాలకు ఆయన ఎదురు నిలిచి పోరాడాడు. 1919 ఏప్రిల్ 13న అమృతసర్ లో జరిగిన జలియన్ వాలాబాగ్ సంఘటన గాంధీని బాగా కలచి వేసింది. ఈ దారుణ మారణ కాండలో జనరల్ డయ్యర్..నాలుగు వందల మంది పౌరులను పొట్టన పెట్టుకున్నారు. సత్యాగ్రహం, అహింసా అనే మార్గాలు వద్దంటూ అనేక మంది గాంధీ విధానాలకు ఎదురు తిరిగింది అప్పుడే. అయినా వెనక్కు తగ్గలేదు గాంధీ. తాను ఆచరించిన మార్గాల ద్వారానే స్వరాజ్యం సిద్దిస్తుందని పిలుపునిచ్చేవాడు గాంధీ. 1921లో జాతీయ కాంగ్రెస్ కు తిరుగులేని నాయకుడిగా ఎన్నికయ్యాడు గాంధీ.
ఆంధ్రాలో పర్యటన, స్వదేశీ-విదేశీ వస్తువుల బహిష్కరణ, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, బ్రిటీష్ విద్య, వారి సత్కారాలను తిరస్కరించడం వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు గాంధీ. ఫలితంగా ఉద్యమంలో క్రమ శిక్షణ పెరిగింది. మహిళా లోకం కొంగు బిగించింది. వాడ వాడలా ఉవ్వెత్తున నినదించింది. మరోవైపు సహాయ నిరాకరణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. ఇందులో భాగంగా ప్రజలెవరు పన్నులు కట్టవద్దనే పిలుపునిచ్చారాయన. ఊహించని స్పందన వచ్చింది. ఆంగ్లేయుల గుండెల్లో గుబులు రేగింది. ఇదే సమయంలో ఉత్తర్ ప్రదేశ్ లోని చౌరీ చౌరాలో జరిగిన హింసాత్మక సంఘటనతో భయపడ్డాడు గాంధీజీ. ఉద్యమం అదుపు తప్పుతుందని భావించి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం రెండేళ్ల పాటు జైలు జీవితం గడిపారు మహాత్మ. ఈ కాలంలోనే కాంగ్రెస్ లో అతివాదులు, మితవాదుల మధ్య అభిప్రాయ భేదాలు బలపడ్డాయి. హిందూ-ముస్లింల మధ్య వైషమ్యాలు పెరిగాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గాంధీజి మూడు వారాల పాటు నిరాహార దీక్ష చేశారు.
అనంతరం గాంధీ మద్యపానం, అంటరాని తనం, నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1927లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా సాగిన స్వరాజ్య ఉద్యమంతో మళ్లీ చురుకైన పాత్ర పోషించారు గాంధీ. 1930 మార్చి 21న ప్రారంభమైన దండి యాత్ర ఏప్రిల్ 6 వరకు కొనసాగింది. నాలుగు వందల కిలోమీటర్లు సాగిన ఈ యాత్రలో అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. అహ్మదాబాద్ నుంచి దండి వరకు ఈ యాత్ర సాగింది. ఉప్పు సత్యాగ్రహంగా పేరొందిన ఈ ఉద్యమంతో ఊరూరా ప్రత్యేక సంఘాలు ఏర్పడ్డాయి. దేశంలో మొత్తం 60 వేల మంది జైలుకు వెళ్లారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది. గాంధీ- ఇర్విన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఫలితంగా అందరినీ విడుదల చేసింది సర్కారు. 1932లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు కాంగ్రెస్ నుంచి వెళ్లిన ఏకైన ప్రతినిధి బాపూజీ. ఆ సమావేశం తర్వాత మరోసారి ఉద్యమం మొదలు పెట్టారు గాంధీ.
1934లో గాంధీ పై మూడు సార్లు హత్యప్రయత్నాలు జరిగాయి. అహింసా పద్దతిని పాటిస్తు దేశానికి స్వాతంత్ర్యం రాకుండా గాంధీ అడ్డుకుంటున్నారనేది అతి వాదుల మాట. వారికి విప్లవ కారుల సాయం అందింది. అయినా…అహింసా పద్దతిని వీడలేదు మహాత్ముడు. 1933 మే8 నుంచి 21 రోజుల పాటు నిరహార దీక్ష చేశారు గాంధీజీ. 1938లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాస్ చంద్రబోస్ తో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. బోస్ కు అహింసా పద్దతి నచ్చలేదని గాంధీ భావన. మరోసారి బోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని గాంధీ జీర్ణించుకోలేక పోయారనే వాదనుంది. తర్వాత వచ్చిన పరిణామాలతో బోస్ కాంగ్రెస్ కు దూరమయ్యారు.
1942లో వచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. దేశ వ్యాప్తంగా ఊరేగింపులు, అరెస్టులు, ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఫలితంగా 1942 ఆగస్టు 9న గాంధీతోపాటు..కాంగ్రెస్ కార్యవర్గం అరెస్టు అయింది. గాంధీ రెండేళ్ల పాటు పూణే జైలులో గడిపారు. గాంధీ సహ ధర్మచారిణి కస్తూరి బాయి 18 నెలల కారాగారం తర్వాత అక్కడే మరణించింది. గాంధీ ఆరోగ్యం బాగా దెబ్బతింది. అనారోగ్య కారణంగా మహాత్మను 1944లో విడుదల చేశారు. ఆయనతో పాటు..లక్షకు పైగా ఉద్యమకారులు బయటకు వచ్చారు. భారత్ కు స్వాతంంత్ర్యం వస్తుందని బలంగా భావించారు ప్రజలు. 1946లో వచ్చిన బ్రిటీష్ క్యాబినెట్ మిషన్ ఏ ప్రాతిపదికన దేశం ఇవ్వాలని అడిగింది. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించడాన్ని గాంధీ ఒప్పుకోలేదు. ముస్లిం నాయకుడైన మహమ్మద్ ఆలీ జిన్నాను ప్రధాని మంత్రిగా చేసైనా దేశ విభజనను ఆపాలని గాంధీ భావించారు. ఇది హిందూ- ముస్లింల మధ్య మరింత చిచ్చు రాజేసింది. నెహ్రు, సర్దార్ వల్లబాయ్ పటేల్ లు గాంధీ విధానాన్ని వ్యతిరేకించారు. దేశ విభజనో..అంతర్గత యుద్ధమో తేల్చుకోండని జిన్నా పిలుపునివ్వడం గాంధీని ఇరకాటంలో పడేసింది.
గత్యంతరం లేక దేశ విభజనకు గాంధీని ఒప్పించాడు ఉక్కుమనిషి పటేల్. భారత్ ముక్కలవడాన్ని గాంధీని కుంగదీసింది. 1947 ఆగస్టు 15న దేశ మంతా సంబరాలు జరుపుకుంటుంటే..గాంధీ మాత్రం కలకత్తాలోని ఒక హరిజన వాడన శుభ్రం చేస్తు గడపడం ఆసక్తికరం. ఇక గాంధీ హత్యకు దారితీసింది హిందు- ముస్లింల మధ్య నెలకొన్న కలహాలే అనే వాదనుంది. విభజన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు ఇవ్వాల్సిన 55 కోట్ల రూపాయలను ఆ దేశానికి ఇచ్చేందుకు నిరాకరించింది భారత ప్రభుత్వం. దీన్ని వ్యతిరేకించారు గాంధీ. అంతటితో ఊరుకోలేదు. మత హింస ఆపాలని, పాకిస్తాన్ కు 55 కోట్లు ఇవ్వాలంటూ దీక్షకు దిగారాయన. ఎవరెన్ని చెప్పినా..మానలేదు. చివరకు ప్రభుత్వం దిగొచ్చి..పాకిస్తాన్ కు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో గాంధీ పట్ల కొందరికి ద్వేషం పెరిగింది. గాంధీ పాకిస్తాన్ కు ముఖ్యంగా ముస్లింలకు వత్తాసు పలుకుతున్నారని భావించారు. ఇదే పరిస్థితి ఇక ముందు కొనసాగింతే భారత దేశానికే ప్రమాదమనేంతగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారమే గాంధీ హత్యకు పురిగొల్పింది.
ఆ రోజు ఏం జరిగిందంటే…
అది 1948 జనవరి 30. ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ఉన్న ప్రార్ధనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నారు మహాత్మా గాంధీ. సమయం సాయంత్రం 5 గంటల 17 నిమిషాలు. ఆయనతో పాటు..ఆంతరంగిక కార్యదర్శి వెంకట కళ్యాణం, సహచరురాలు ఆఛా ఛటోపాధ్యాయ ఉన్నారు. అందరినీ పక్కకు నెడుతు ముందుకు కదులుతోందామె. అప్పుడే ఎదురొచ్చాడు నాధురాం వినాయక్ గాడ్సే. రెండు చేతులతో వినయంగా నమస్కారం చేశాడు. అనంతరం ఎడమ చేతితో అడ్డంగా ఉన్న అమ్మాయిని తొలగించి కుడి చేతిలోకి పిస్టల్ తీసుకున్నాడు. చేతిలో ఉన్న 380 ఏసీపీ పాయింట్ పిస్టల్ తో గాంధీ ఛాతిలోకి గురి చూసి కాల్చాడు. సెమీ ఆటోమేటిక్ పిస్టల్ తో గాంధీని మూడు సార్లు కాల్చాడు. అంతే ఒక్కసారిగా మహాత్ముడు కుప్ప కూలాడు. గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకుపోగా..మరో రెండు బుల్లెట్లు పొట్టలోకి వెళ్లాయి. గాంధీజీ చివరి క్షణాల్లో హే రామ్ అన్నారని కొందరు చెబుతుండగా..అలాంటి పదమే పలకలేదన్నది గాడ్సే మాట. ఈ సంఘటన పై స్పందించిన మాజీ ప్రధాని నెహ్రు ఆ విషయాన్ని రేడియా ద్వారా ప్రకటించారు. మన జీవితాల్లో వెలుగు అంతరించి చీకటి కమ్ముకుందని చెప్పారు. నాకు మాటలు రావడం లేదు. మన జాతిపిత ఇక కంటికి కనిపించరని చెప్పారు.
గాంధీని హతమార్చాక గాడ్సే పారిపోలేదు. పోలీస్ పోలీస్ అని కేక వేసి..లొంగిపోయారు. తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలన్నదే అతని ఆరాటం. తప్పని సరి పరిస్థితుల్లోనే తానీ పని చేయాల్సి వచ్చిందని చెబుతూనే బాపూజీ మృతి తనను కలిసి వేస్తుందని అభిప్రాయ పడ్డారు. అనంతరం గాడ్సేను అదుపులోకి తీసుకున్న పోలీసులు తుగ్లక్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీస్ అధికారి జస్వంత్ సింగ్ హత్యకు దారి తీసిన సంఘటన పై విచారణ జరిపారు. గాడ్సేకు సహకరించిన నారాయణ ఆప్టేను విచారించారు. అనంతరం గాడ్సే, నారాయణ ఆప్టేలను హర్యానాలోని అంబాలా జైలులో 1949 నవంబర్ 15న ఉరితీశారు.
స్వతంత్ర భారత దేశంలోఉరితీసిన మొదటి వ్యక్తి నాధురాం గాడ్సేనే. గాంధీజీ బతికుంటే..జమ్మూ కాశ్మీర్ ను పాకిస్తాన్ కు ధారాదత్తం చేసేవారు. అందుకే గాంధీని కాల్చి చంపానని అభిప్రాయ పడ్డారు గాడ్సే. స్వాతంత్ర్యం వచ్చాక గాంధీ బతికితే మరో పదేళ్లు బతకవచ్చు. కానీ తాను భారత దేశం కోసం 50 ఏళ్ల జీవితాన్ని త్యాగం చేస్తున్నానని ప్రకటించారు గాడ్సే. భారతదేశాన్ని ముక్కలు చేయడం ఇష్టం లేకనే ఈ పని చేసినట్లు చెప్పుకున్నాడు గాడ్సే. గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం. అందుకే తాను ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి మరీ ఈ పని చేసినట్లు గాడ్సే చెప్పుకోవడం దేశ వ్యాప్తంగా మరోసారి చర్చకు తెరలేచింది. గాంధీని హతమార్చిన గాడ్సే కు గుడి కట్టే పని జరుగుతుందిప్పుడు. బీజేపీ నేత సాక్షి మహరాజ్ అయితే మరింత ముందుకెళ్లి పార్లమెంటులోనే చర్చకు తెరలేపిన సంగతి తెలియంది కాదు. గాడ్సే మహాత్ముడుని ఎంపీ చెప్పడం వివాదాన్ని రేపింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశ భక్తుడు గాడ్సే అంటూ కొనియాడారు. గాంధీని చంపాక..పారిపోయే అవకాశం ఉన్నా..ఆ పని చేయకుండా లొంగి పోయారని ఆయన గుర్తు చేయడం చర్చనీయాంశమైంది.
మహాత్మాగాంధీ ఆశయాలు, ఆయన సిద్దాంతాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం అయ్యాయి. గాంధీ పాటించిన అహింసా, సత్యాగ్రహ సిద్దాంతాలు తమకు ఆచరణీయమని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారంటే ఎంతగా ప్రాధాన్యత ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఇప్పటి యువత గాంధీ సిద్దాంతాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉంది.
Comments
comments